బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఈ వర్షాలకు కారణమని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం వివరించింది.
అంతేకాకుండా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండడంతో హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉప్పల్, పీజాడిగూడ, తార్నాక తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అంబర్‌పేట, మూసారాంబాగ్, మలక్‌పేటలో భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. చంపాపేట్, ఐఎస్ సదన్, సంతోష్ నగర్, సైదాబాద్, చాదర్ ఘాట్, కోటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
కాగా, వరంగల్ జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఓ గ్రామ శివారులో యువకులు పార్టీ చేసుకుంటుండగా పిడుగు పడింది. ఈ ఘటనలో మద్యం సేవించిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో పండుగ సందర్భంగా విషాదం నెలకొంది. మరో వైపు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు వర్షం కురిసింది.