హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం.. రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతోందంటే..?
Rain In Hyderabad. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజామున నగర శివార్లలోని దుండిగల్,
By Medi Samrat
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజామున నగర శివార్లలోని దుండిగల్, గండిమైసమ్మలో ఈదురుగాలులలో కూడిన వాన పడింది. బహదూర్‌పల్లిలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం కురిసింది. నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడుతుండంతో వాతావరణం కొద్దిగా చల్లబడింది.
తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రెండ్రోజుల పాటు అక్కడక్కడ ఈదురుగాలులతో అకాల వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. రాబోయే రెండు రోజులు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని ప్రకటించింది. ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, భూపాలపల్లి, ములుగు , భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. శనివారం పల్నాడు జిల్లా రావిపాడు 45.6°C, గుంటూరు జిల్లా మంగళగిరి, తూర్పుగోదావరి జిల్లా పేరవలి, బాపట్ల జిల్లా వేమూరు, మన్యం జిల్లా పేదమేరంగిలో 45.5°C ల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 143 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు అధికారులు తెలిపారు. ఇక కొన్ని ప్రాంతాల్లో వర్షం కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున సత్యసాయి జిల్లాలో వర్షం కురిసింది.