రాబోయే మూడు రోజులు తెలంగాణలో వర్షాలు
Rain Alert For Telangana State. తెలంగాణలో మూడు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు
By Medi Samrat Published on 10 Jan 2022 2:28 PM IST
తెలంగాణలో మూడు రోజులు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అలాగే, ఈ నెల 12వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వివరించింది. ప్రస్తుతం ఆగ్నేయ దిశ నుంచి రాష్ట్రంలోకి ఉపరితల గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
వాతావరణ విశ్లేషణ (సోమవారం ఉదయం 08:30 ఆధారంగా) :
ఈ రోజు ఉపరితల ద్రోణి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుండి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9కి మి ఎత్తు వద్ద ఏర్పడినది. ఈ రోజు గాలులు ముఖ్యంగా దక్షిణ/ నైరుతి దిశల నుండి తెలంగాణా రాష్ట్రం వైపు వీస్తున్నాయి.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన :
ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో తేలిక పాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల పడనున్నాయి. రేపు, ఎల్లుండి చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. రాగల మూడు రోజులు తెలంగాణా రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కొన్ని జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎల్లుండి వడగండ్లతో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీమ్, మంచిర్యాల, నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల మరియు పెద్దపల్లి జిల్లాలలో పడే అవకాశాలు ఉన్నాయి .