ఎగువ రాష్ట్రల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద వచ్చి చేరుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. వరద ప్రవాహ హెచ్చుతగ్గులను పర్యవేక్షిస్తూ కృష్ణా, గోదావరి పరివాహక జిల్లాల్లోని క్షేత్రస్థాయి అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అలెర్ట్ మేసేజ్లు పంపిస్తున్నామన్నారు. వినాయక నిమజ్జన సమయంలో నదీ, కాలువల వద్ద హెచ్చరిక సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదని సూచించారు.
శుక్రవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 42.2 అడుగులు అందని పేర్కొన్నారు. ధవళేశ్వరం వద్ద 6 గంటలకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 7.58 లక్షల క్యూసెక్కులు ఉందని, రేపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3,08,838 క్యూసెక్కులు ఉందని తెలిపారు. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదీపరీవాహక లోతట్టు ప్రాంత గ్రామప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని చెప్పారు.
రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.