బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. నవంబర్ 21 నాటికి దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా బలపడుతుందని ఏపీఎస్డీఎంఏ తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో నవంబరు 27, 28 తేదీల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్డీఎంఏ వివరించింది.
అల్పపీడన ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ కడపలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 26 నుండి 29 వరకు ఏపీలోని మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలో డిసెంబర్ 1 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటల విషయంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు.