బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండగా, రేపు మరో కొత్త అల్పపీడనం ఏర్పడనుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ రెండు వాతావరణ వ్యవస్థల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోందని, ఇది రానున్న 24 గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక వైపు కదులుతూ మరింత బలహీనపడనుందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని కారణంగా శుక్రవారం ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొత్తగా మరో అల్పపీడనం ఏర్పడనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.