అప్రమత్తంగా ఉండండి.. మ‌రో రెండు రోజులపాటు వ‌ర్షాలు

Rain Alert For Andhra Pradesh. ఆగ్నేయ బంగాళాఖాతంలోని మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడిందని..

By Medi Samrat  Published on  10 Dec 2022 3:30 PM GMT
అప్రమత్తంగా ఉండండి.. మ‌రో రెండు రోజులపాటు వ‌ర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలోని మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడిందని.. అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తుపాను నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం ముందు నుంచి ప్రత్యేక చర్యలను తీసుకుందన్నారు. సిఎస్ జవహర్ రెడ్డి ప్రతిరోజు సమీక్షలు నిర్వహించి అధికారులకు అమలు చేయాల్సిన విధివిధానాలు గురించి ఆదేశాలు జారీచేసారని తెలిపారు. అల్పపీడనం ఏర్పడినప్పటి నుంచి విపత్తుల సంస్థలోని స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి విపత్తుల సంస్థ డైరెక్టర్ అంబేద్కర్ తో కలసి తుపాను కదలికలు పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడూ సంబంధిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు జారీ చేసామన్నారు.

తుపాను సమయంలో విపత్తుల సంస్థ యంత్రాంగం 24 గంటలు నిరంతరం పనిచేస్తూ సత్వరం స్పందించడం, ఉద్రిక్తతను స్పష్టంగా అంచనా వేయడంతో పాటు ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన నష్టతీవ్రతను తగ్గించగలిగామని అన్నారు. సముద్రంలో వేటకు వెళ్ళిన మత్స్యకారులను వెనక్కి పిలిపించామన్నారు. భారీ వర్షాలు, ఈదుర గాలులు నేపధ్యంలో కామన్ అలర్ట్ ప్రోటోకాల్, ఏపీ అలెర్ట్ ద్వారా ఆరు జిల్లాల్లోని సుమారు కోటిమందికి పైగా సబ్ స్ర్కైబర్లకి ముందుగానే తుపాను హెచ్చరిక సందేశాలు పంపినట్లు వివరించారు.

ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను తీవ్రతను చూపిందన్నారు. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించినట్లు చెప్పారు. 33 సహాయ శిబిరాలని ఏర్పాటు చేసామని, 778 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. 1469 ఆహారపు ప్యాకెట్లు , 2495 వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సహాయక చర్యలకోసం ప్రకాశం-2, నెల్లూరు-3, తిరుపతి-2, చిత్తూరుకు-2 మొత్తంగా 5ఎన్డీఆర్ఎఫ్, 4ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామని తెలియజేశారు.

వర్షపాతం వివరాలు :

శుక్రవారం ఉదయం 8.30 గం.ల నుండి శనివారం ఉ.8.30గం.ల వరకు అన్నమయ్య జిల్లాలో 23.3 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 30.5,ప్రకాశం జిల్లాలో 14.1, ఎస్పి ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 57.6, తిరుపతి జిల్లాలో 75.7, వైయస్సార్ కడప జిల్లాలో 14.5 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని ఆరు జిల్లాల్లోని 109 ప్రాంతాల్లో 64.5 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు తెలిపారు.

శనివారం ఉదయం 8.30 గం.ల నుండి సాయంత్రం 5.30గం.ల వరకు అన్నమయ్య జిల్లాలో 20.5 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 22 , ప్రకాశం జిల్లాలో 10.1, ఎస్పి ఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 23.4., తిరుపతి జిల్లాలో 2.4, వైయస్సార్ కడప జిల్లాలో 13.2 మిల్లీమీటర్ల వంతున సరాసరి వర్షపాతం నమోదైందని ఆరు జిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు చెప్పారు.


Next Story
Share it