అమరావతి: ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. వీటి ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొంది. ఇవాళ మన్యం, అల్లూరి, పల్నాడు, జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది.
ఆదివారం నాడు తూర్పు గోదావరి, ఏలూరు, అనంతపురం, నంద్యాల, అనకాపల్లి, కర్నూలు, ఎన్టీఆర్, నెల్లూరు తదితర జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా రాజమహేంద్రవరంలో 53 మి.మీ వర్షపాతం నమోదు అయ్యింది. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో మాత్రం వేడి వాతావరణం నమోదయింది. కావలిలో ఆదివారం గరిష్ఠంగా 37.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. అటు తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి.