తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం, ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. వాయువ్య దిశల నుంచి వీచే గాలుల కారణంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే.. శనివారం వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. ఇదిలావుంటే.. చలిగాలుల తీవ్రతతో రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. నిన్న ఉదయం నిర్మల్‌లోని తానూరులో 10.9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
గత వారం రాష్ట్రంలోని సూర్యాపేట సహా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. సూర్యాపేట జిల్లాలోని శ్రీరామ్ నగర్, మానస నగర్, వినాయక్ నగర్, కృష్ణ కాలనీ, వీఆర్డీఆర్ శ్రీనివాస్ కాలనీ, గోపాలపురం, ఆర్కే గార్డెన్స్ కాలనీలు జలమయమయ్యాయి. ఇదిలావుంటే.. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఐదు రోజుల క్రితం 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో మాత్రం, ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ విభాగం పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఎలాంటి సమస్య ఉండదని అధికారులు సూచించారు.