ఈ ఏడాది వర్షాలు ఎంతమాత్రం పడబోతున్నాయంటే?
ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2024 8:30 PM ISTఈ ఏడాది వర్షాలు ఎంతమాత్రం పడబోతున్నాయంటే?
హైదరాబాద్: ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. 'లా నినా' డెవలప్‌మెంట్, బలమైన రుతుపవనాలు కారణంగా సగటు కంటే ఎక్కువ వర్షాలు పడతాయి. చల్లటి ఉష్ణోగ్రతలు కూడా వర్షాలకు కారణమవనున్నాయి. జూలై నాటికి బలహీనపడుతున్న ఎల్ నినోను భర్తీ చేస్తుందని.. సమృద్ధిగా వర్షపాతం కురుస్తుందని.. ఉపశమనాన్ని కలిగిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
కేంద్ర భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్, తగ్గుతున్న ఎల్ నినో గురించి వివరించారు. జూలై నాటికి లా నినా సంభావ్య ఆవిర్భావం కారణంగా వర్షాలకు అనుకూల పరిస్థితులను చూస్తామని తెలిపారు. భారతదేశంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని.. రుతుపవన వర్షాలతో లా నినా కు 50 శాతం కంటే ఎక్కువ సంభావ్యత ఉందని తెలిపారు. ఎల్ నినో నుండి లా నినాకు పరివర్తన ప్రాముఖ్యత కూడా ఉంటుందని రాజీవ్ తెలిపారు. ఇటువంటి మార్పులు వర్షాలకు దారితీసిన గత సందర్భాలను కూడా ఆయన ఉదహరించారు.
మాధవన్ రాజీవన్ చారిత్రక డేటాను ప్రస్తావించారు. 1972-73, 1982-83, 1987-88, 1997-98, 2002-2003, 2009-2010, 2015-2016 సంవత్సరాలలో ఇలాంటి తరహా పరిస్థితులే ఉండేవని.. ఆ సంవతసరాలలో వర్షాలు బాగా కురిశాయని అన్నారు. మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా వేడెక్కడం ద్వారా ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ (ENSO) ను వర్గీకరిస్తారు. ఇలాంటి పరిస్థితులు భారతీయ రుతుపవనాలతో సహా ప్రపంచ వాతావరణ నమూనాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. ఎల్ నినో సాధారణంగా భారతదేశంలో రుతుపవన వర్షపాతాన్ని అణిచివేస్తుంది, అయితే లా నినా రుతుపవన వర్షపాతాన్ని పెంచుతుంది.
ఈ సూచనలు యునైటెడ్ స్టేట్స్‌లోని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) నుండి వచ్చిన అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. ఆగస్టు-సెప్టెంబర్, అక్టోబర్ మధ్య లా నినా పరిస్థితులు అభివృద్ధి చెందడానికి 60 శాతం సంభావ్యతను అంచనా వేసింది. రాజీవ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో స్పందిస్తూ "జూలై నాటికి, లా నినా అభివృద్ధి చెందుతుంది. 50 శాతం కంటే ఎక్కువ అవకాశం ఉంటుంది. 2024 రుతుపవనాలకు అధిక సంభావ్యత ఉండాలి. దేశమంతటా ఒక మంచి అనుభూతిని పంచనుంది." అని అన్నారు.
ఎల్ నినో - లా నినా వేటికవే వ్యతిరేకం. ఎల్ నినో వేడి వేసవి- బలహీనమైన రుతుపవనాలతో సంబంధం కలిగి ఉంటుంది, అయితే లా నినా సముద్ర-ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చల్లగా ఉండే దశను సూచిస్తుంది. బలమైన రుతుపవనాలు, సగటు కంటే ఎక్కువ వర్షాలు, చల్లని శీతాకాలాలకు దారితీస్తుంది. వర్షాకాలం కోసం ఎదురుచూపులు పెరుగుతున్నందున, 2024లో వర్షాలు ఆశాజనకంగా ఉంటాయనే వార్త ఆనందాన్ని ఇస్తూ ఉంది.