పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు ఆనుకుని ఉన్న అల్పపీడనం రాబోయే 12 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్ళరాదని సూచించింది. అల్పపీడనం ప్రభావంతో నేడు అక్కడక్కడ చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించిది.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు - భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు.
అటు తెలంగాణలో కూడా ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వరంగల్, మెదక్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మిగతా జిల్లాల్లో భారీ వానలు పడతాయని చెప్పింది.