తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో భారత వాతావరణ శాఖ ఓ కీలక అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కాగా, నేడు బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడనుందనే అంచనాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
అండమాన్ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడతాయని వెల్లడించింది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వెల్లడించింది.
ఏపీలోని ఉత్తర కోస్తా లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. దక్షిణ కోస్తా తో పాటుగా రాయలసీమలోనూ మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు పడతాయని వాతవరణ శాఖ అంచనా వేస్తోంది. బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.