అల‌ర్ట్‌.. ఈ జిల్లాల‌కు అతి భారీ వ‌ర్ష సూచ‌న‌

IMD predicts heavy rainfall for two days across Telugu states.తెలుగు రాష్ట్రాల‌ను వ‌రుణుడు వ‌ద‌ల‌డం లేదు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 Oct 2022 9:27 AM IST
అల‌ర్ట్‌.. ఈ జిల్లాల‌కు అతి భారీ వ‌ర్ష సూచ‌న‌

తెలుగు రాష్ట్రాల‌ను వ‌రుణుడు వ‌ద‌ల‌డం లేదు. వ‌ద్దంటే వాన‌లు ప‌డుతున్నాయి. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో వాన‌లు దంచికొడుతున్నాయి. గురువారం ప‌లుచోట్ల భారీ వ‌ర్షాలు ప‌డ‌గా.. వాతావ‌ర‌ణ శాఖ మ‌రోసారి రెయిన్ అల‌ర్ట్ ఇచ్చింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో అక్టోబరు 10 వరకు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు(శుక్ర‌వారం) వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని, ఆయా జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ చేసింది.

జనగాం, సిద్దిపేట, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ ఉరుములు మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని తెలిపింది.

అటు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌న ప్ర‌భావంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ శుక్ర, శని వారాల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు రాయలసీమ, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, ఎల్లుండి (అక్టోబరు 8) రాయలసీమ, ఉత్తరాంధ్రలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల 10 వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం విధించారు.

Next Story