ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో బుధవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది.
అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
ఆదివారం మధ్యాహ్నం వాతావరణ శాఖ విడుదల చేసిన వాతావరణ బులెటిన్‌లో సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలోని దాదాపు 10 ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు మంచిర్యాలలోని కొల్లూరులో 17.3, జయశంకర్ భూపాలపల్లిలోని ముత్తారం మహదేవ్‌పూర్‌లో 13.7, మంచిర్యాలలోని నీల్వాయిలో 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.