తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వేసవి కాలం కావడంతో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా వర్షం కురుస్తున్నప్పటికీ ఉక్కపోత కారణంగా జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక బుధవారం తెలంగాణలో భానుడు ఉగ్ర రూపం దాల్చి నిప్పులు చెరిగాడు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలోని జైసద్‌లో 45.7, జగిత్యాలలోని ఐలాపూర్ 45.1 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇవే కావడం గమనార్హం. మరో పది జిల్లాల్లో 43.9 నుంచి 44.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఇదిలా ఉండగా.. నేడు, రేపు (గురు, శుక్ర) కూడా రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 3 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పింది. మరో వైపు కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది.