వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడిందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటున 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరింత బలపడి మంగళవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని, ఒడిశా మీదుగా మధ్యప్రదేశ్ వైపు ప్రయాణించి క్రమంగా బలహీనపడుతుందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రా జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో కోస్తా వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. మిగిలిన కోస్తా జిల్లాలు, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. అల్పపీడన ప్రభావంతో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు నగరం, దెందులూరు, ఉంగుటూరు, కైకలూరు నియోజకవర్గాలతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున దాదాపు మూడు గంటలపాటు కుండపోత వర్షం కురవడంతో రహదారులన్నీ నిలిచిపోయాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది.
నైరుతి రుతుపవనాల తిరోగమనం ఈ వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 15 నాటికి నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ నుండి ఉపసంహరించుకునే అవకాశం ఉందని ఐఎండీ-అమరావతి అంచనా వేసింది.