తెలంగాణకు బిగ్‌ అలర్ట్‌.. 5 రోజులపాటు భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు తడిసి ముద్దవుతూ ఉండగా.. రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరగనున్నాయి.

By M.S.R
Published on : 18 May 2024 7:45 AM IST

Hyderabad, IMD, Telangana, heavy rains

తెలంగాణకు బిగ్‌ అలర్ట్‌.. 5 రోజులపాటు భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు తడిసి ముద్దవుతూ ఉండగా.. రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరగనున్నాయి. మహారాష్ట్రలోని పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తన ద్రోణి ఏర్పడడంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని తెలిపింది. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మ లాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మహబూబనగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో నేడు వర్షాలు కురవనున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వర్ష సూచన చేశారు వాతావరణ శాఖ అధికారులు. రాయలసీమ, ఉత్తర తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. శుక్రవారం కూడా రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల భారీవర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో పలుచోట్ల, ఉత్తరకోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇంకా ఈ నెల 23 వరకు రాష్ట్రంలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Next Story