తుఫాన్ వార్తలపై సోషల్, డిజిటల్ మీడియా సంయమనం పాటించాలి

మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.

By -  Medi Samrat
Published on : 27 Oct 2025 6:40 PM IST

తుఫాన్ వార్తలపై సోషల్, డిజిటల్ మీడియా సంయమనం పాటించాలి

మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలకు ఆస్కారం ఇవ్వొద్దని హోం మంత్రి ఒక ప్రకటనలో కోరారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయని ఆమె తెలిపారు. రాష్ట్రంపై తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ హెచ్చరిక వచ్చినప్పట్నుంచి సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అలెర్ట్ అయిందని... గత మూడు రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోందని మంత్రి అనిత వివరించారు. సీఎం చంద్రబాబుతో పాటు ఐటీ మంత్రి నారా లోకేష్, తాను ఆర్టీజీ సెంటర్ నుంచి సమీక్షలు నిర్వహించి అన్ని విభాగాలను అలెర్ట్ చేశామని... యంత్రాంగాన్ని సిద్దం చేశామని అనిత చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులందరూ సమన్వయంతో పని చేయడానికి అవసరమైన ప్రణాళికను ప్రభుత్వం సిద్దం చేసిందని...జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించడంతో పాటు... తుఫాను సహాయక చర్యలకు అవసరమైన నిధులను విడుదల చేశారని వివరించారు. అలాగే కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం... మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం చేరవేస్తోందని ఆ ప్రకటనలో హోం మంత్రి పేర్కొన్నారు.

సోషల్ మీడియా, డిజిటల్ మీడియా సంయమనం పాటించాలి

ఇలాంటి సమయంలో ప్రజలకు వేగంగా సమాచారాన్ని చేరవేసే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా సంస్థలు తుఫాను వార్తల కవరేజ్ విషయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని అనిత అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్‌లపై తుఫాను గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లు ప్రభుత్వ పరిశీలనలో తేలిందని ఆమె చెప్పారు. ఈ క్రమంలో కొన్ని యూ ట్యూబ్ చానళ్లు, డిజిటిల్ మీడియా సంస్థలు పెట్టే థంబ్ నెయిల్స్ ప్రజలను భయపెట్టేలా ఉంటున్నాయని అన్నారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో పెడుతోన్న కొన్ని థంబ్ నెయిల్స్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని... ఈ మేరకు ఆర్టీజీ సెంటర్ నుంచి తమకు సమాచారం వచ్చిందని అనిత తెలిపారు. సంచలనాల కోసం పెట్టే తప్పుడు హెడ్డింగ్ లు, థంబ్ నెయిల్స్ కారణంగా ప్రజల్లో తీవ్ర గందరగోళం నెలకొనే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ఇది ప్రజల్లో అలజడికి కారణం అవుతుందని... ఈ నేపథ్యంలో తుఫాను విషయంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా కాకుండా.. వాస్తవాలకు అద్దం పట్టే విధంగా వార్తల కవరేజ్ చేయాలని ప్రభుత్వం సోషల్ మీడియా, డిజిటల్ మీడియా సంస్థలను అనిత కోరారు. సంచలనాల కోసం, వ్యూస్ కోసం ప్రజలను భయపెట్టేలా వ్యవహరించడం చట్ట విరుద్దమన్నారు. అభూత కల్పనలు, అవాస్తవాలు, తప్పుదారి పట్టించేలా తుఫానుకు సంబంధించిన సమాచారం ప్రజల్లోకి వెళితే ఆ ప్రభావం ముంపు ప్రాంతాల ప్రజలు, వారి కుటుంబ సభ్యులుపై తీవ్రంగా ఉంటుందని...దీన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని వాస్తవాలకు అద్దం పట్టేలా తుఫాను వార్తల కవరేజ్ ఉండాలని ప్రభుత్వం ఆయా సంస్థలను హోం మంత్రి కోరారు. ప్రజలకు సమాచారం చేరవేడంలో అత్యంత కీలకమైన పత్రికలు, టీవీ ఛానెళ్లతో పాటు.... సోషల్ మీడియా, డిజిటల్ మీడియా మరింత జాగ్రత్తగా, బాధ్యతగా వార్తలు ప్రజలకు చేరవేయాలని హోం మంత్రి అనిత తెలిపారు.

Next Story