బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై హోం మంత్రి సమీక్ష
బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు.
By Medi Samrat
బంగాళాఖాతంలో వాయుగుండం, భారీ వర్షాలపై హోం, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. వాయుగుండం ఈరోజు పశ్చిమ బెంగాల్, ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీరాలను తాకే అవకాశం ఉంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ బెంగాల్,ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపుగా కదులుతుంది. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, సిబ్బందితో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పిరిస్థితిని హోం మంత్రి అనిత స్వయంగా పరిశీలించారు. అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాల్సిందిగా ప్రజలను కోరారు.
ఆదివారం వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలర్ట్ చేశారు. తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.. సముద్రం అలజడిగా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులో ఎగసిపడే అవకాశం ఉంటుందని.. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని సూచించారు. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇరిగేషన్, ఆర్& బి, పంచాయితీరాజ్ శాఖలతో నమన్వయ పరుచుకుని గండ్లు గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.