అమరావతి: ద్రోణి ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారాన్ని బట్టి సెప్టెంబర్ 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది సెప్టెంబర్27 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే రోజు పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.