అల‌ర్ట్‌.. మ‌రో రెండు గంట‌ల్లో తెలంగాణ‌లోని ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

Heavy rains in these districts in Telangana another two hours.తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 July 2022 4:15 AM GMT
అల‌ర్ట్‌.. మ‌రో రెండు గంట‌ల్లో తెలంగాణ‌లోని ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్ప‌టికే కురిసిన వ‌ర్షాల కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం కావ‌డంతో పాటు చెరువులు, కుంట‌లు నిండు కుండ‌లా మారాయి. భారీ వ‌ర్షాల వ‌ల్ల సంభ‌వించిన వ‌ర‌ద‌ల వ‌ల్ల ప‌లు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకొనిపోవ‌డంతో చాలా గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. ఇళ్ల‌లోకి నీరు చేర‌డంతో వంట సామాగ్రి త‌డిచిపోయాయి. వ‌ర‌ద గుప్పిట‌లోనే ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే నేడు(మంగ‌ళ‌వారం) కూడా రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌లు జిల్లాలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలంగాణ వెద‌ర్ మ్యాన్‌గా పేరుగాంచిన టి.బాలాజీ చెప్పారు. రానున్న రెండు గంట‌ల్లో వికారాబాద్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గామ‌, పెద్ద‌ప‌ల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్‌, గ‌ద్వాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

నిజామాబాద్‌, కామారెడ్డి, మెద‌క్‌, క‌రీంన‌గ‌ర్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నారాయ‌ణ‌పేట‌, సిరిసిల్ల, ఆసీఫాబాద్‌, జ‌గిత్యాల జిల్లాలో ఓ మోస్తారు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించారు. దీంతో ఆయా జిల్లాల్లోనే ప్ర‌జ‌లు అప్ర‌మ్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ఏదైనా అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా ఉంటేనే మంచిది.

ఇక‌ సోమ‌వారం అర్థ‌రాత్రి దాటిన త‌రువాత నుంచి మంగ‌ళ‌వారం ఉద‌యం వ‌ర‌కు రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం కురిసింది. ప‌లు ప్రాంతాల్లో ర‌హ‌దారుల‌పై మోకాళ్ల‌లోతు నీరు నిలిచిపోయింది. అత్య‌ధికంగా హస్తినాపురంలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మలక్‌పేట‌లో 8.9 సెంటీమీటర్లు, కుర్మగూడలో 8.8 సెం.మీ, ఝాన్సీ బజార్లో 8.7 సెం.మీ, చార్మినార్ ,నారయణ గూడ‌ల‌ లో 8.5 సెం.మీ,నాంపల్లిలో 8.1 సెం.మీ, ఎల్బీనగర్ లో 7.7 సెం.మీ, విజయనగర్ కాలనీలో 7.5 సెం.మీ, శేర్లింగంపల్లి లో 7.4 సెం.మీ, హయత్ నగర్ లో 7 సెం.మీ, ఆసిఫ్ నగర్ లో 6.7 సెం.మీ, రామంతపూర్ లో 6.5 సెం.మీ, బేగంబజార్ లో 6.2 సెం.మీ, స‌రూర్ న‌గ‌ర్‌, అంబ‌ర్‌పేట‌లో 5.9 సెం.మీ, జియా గూడలో 5.8 సెం.మీ, గన్ ఫౌండ్రీ లో 5 సెం.మీ, నాగోల్ లో 4.4 సెం.మీ, అత్తాపూర్ లో 4.1 సెం.మీ, గాజుల రామారావు లో 3.5 సెం.మీ, బాలనగర్ లో 3సెం.మీ, జీడిమెట్లలో 2.4 సెం.మీ, సీతాఫ‌ల్ మండీలో 1.9 సెంటీమీటర్లు, నేరేడుమెట్‌లో 1.2 సెం.మీ ల వ‌ర్షం కురిసింది.

Next Story
Share it