బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని సూచించింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో శనివారం సాయంత్రం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ఆదివారం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అల్పపీడనానికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6కి.మీ ఎత్తు వరకు వ్యాపించిందన్నారు. దీని ప్రభావంతో ఆది, సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో కొద్ది గంటల్లో కుండపోత వాన కురిసే అవకాశం ఉందని చెప్పారు. వర్షాలు పడుతున్న సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తాయన్నారు.కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పెద్దపల్లి జిల్లా అక్కెనపల్లి, పాత మంచిర్యాలలో అత్యధికంగా 9.2 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.