తెలంగాణ రానున్న మూడో రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. ఉపరితల ఆవర్తనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ డైరెక్టర్ తెలిపారు. వరంగల్, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
అటు హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపారు. ఈ నెల 14, 15తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దీంతో పాటు కొన్ని జిల్లాల్లో 20 నుంచి 25 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.