ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, నెల్లూరు, కాకినాడ, కోనసీమ, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
గురువారం కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.