ఏపీకి తుఫాను హెచ్చరిక
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా బలపడినట్లు వాతావరణశాఖ తెలిపింది.
By Medi Samrat
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి అల్పపీడనంగా బలపడినట్లు వాతావరణశాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రానున్న మూడ్రోజుల్లో అల్పపీడనం క్రమంగా బలపడుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించడమే కాకుండా, ప్రధాన పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరిక జారీ చేసింది. "ఉత్తర బంగాళాఖాతంలో ఈరోజు ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 24గంటల్లో బలపడే అవకాశం ఉంది. తదుపరి 48గంటల్లో పశ్చిమవాయువ్య దిశగా ఉత్తర ఒడిశా,పశ్చిమబెంగాల్ తీరాల వైపు కదిలే అవకాశం ఉంది.దీనిప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తారు-భారీ వర్షాలు కురిసే ఆస్కారం ఉంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి." అంటూ ట్వీట్ వేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.
తీరం వెంబడి 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులు వీస్తాయని, కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదులుతుందని APSDMA అంచనా వేసింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.