సిత్రంగ్ తుఫాను బంగ్లాదేశ్‌ను వణికిస్తోంది. ఈ తుఫాను కారణంగా ఇప్పటివరకు కనీసం 13 మంది చనిపోయారు. చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగి ఎంతో మంది ప్రాణాలు తీశాయి. పలు నిర్మాణాలు కూలిపోవడం, పలు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో చాలా మరణాలు సంభవించాయి. ఇక భారత్ లోని అస్సాంలో కూడా తుఫాను ప్రభావం కనిపిస్తోంది. నాగావ్ జిల్లాలో భారీ వర్షాలకు అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. సోమవారం రాత్రి తుపాను కారణంగా మండలంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సిత్రంగ్ ప్రభావంతో, భారత వాతావరణ శాఖ (IMD) సోమవారం అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలలో భారీ నుండి అతి భారీ, అత్యంత భారీ వర్షపాతాన్ని సూచిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
సిత్రంగ్ తుఫాను బంగ్లాదేశ్ వద్ద తీరం దాటి బలహీనపడినప్పటికీ.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. సిత్రంగ్ తుఫాను ఏపీపై ఎలాంటి ప్రభావం చూపకపోయినా.. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. ఈ అల్పపీడనం అక్టోబరు 29 నాటికి శ్రీలంక, తమిళనాడు మధ్యన ఏర్పడనుందని, దీని ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై అధికంగా ఉంటుందని వాతావరణ సంస్థ అంచనా వేస్తున్నాయి.