బలహీన పడుతున్న రెమాల్
By Medi Samrat Published on 27 May 2024 9:38 AM ISTఆదివారం రాత్రి పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ తీరాల మధ్య తీరాన్ని తాకిన రెమల్ తుఫాను సోమవారం క్రమంగా బలహీనపడనుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. తుఫాను పశ్చిమ బెంగాల్‌లో విధ్వంసానికి దారితీసింది.. ఎన్నో వేల చెట్లను నేలకూల్చింది.. ఇళ్లను ధ్వంసం చేసింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం నెలకొంది. సుందర్‌బన్స్‌లోని గోసాబా ప్రాంతంలో శిథిలాల కారణంగా ఒక వ్యక్తి గాయపడగా, కోల్‌కతాలోని బిబీర్ బగాన్ ప్రాంతంలో గోడ కూలిపోవడంతో మరొక వ్యక్తి గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల నుంచి లక్ష మందికి పైగా ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తుఫాను ఆదివారం రాత్రి 8.30 గంటలకు రాష్ట్రంలోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య తీరాన్ని తాకింది. ఈ సమయంలో గాలుల వేగం గంటకు 135 కి.మీ. గా ఉంది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్, కోల్‌కతా పోలీస్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ బృందాలు నగరంలోని అలీపూర్ ప్రాంతంలో నేలకొరిగిన చెట్లను తొలగిస్తూనే ఉన్నాయి. రోడ్లను క్లియర్ చేసే పని జరుగుతోందని, సోమవారం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు చెప్పారు.