దిత్వా తుఫాను ప్రభావంతో నేడు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల,అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో కడప, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఇవాళ సెలవు ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించి తరగతులు నిర్వహించే విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
అటు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలపై దిత్వా తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ఇవాళ ఖమ్మం, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో బారీ వర్షాలకు ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న 3 రోజులు చలిగాలులు అధికంగా వీచే అవకాశం ఉందని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించింది. అర్ధరాత్రి నుంచి భద్రాద్రి, ఖమ్మం, ఆసిఫాబాద్, నల్గొండ తదితర జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జల్లులు పడుతున్నాయి.