పొంచిఉన్న మ‌రో తుఫాన్ గండం

Burevi Cyclone. నివ‌ర్‌ తుఫాన్ నుంచి ఇంకా కోలుకోక ముందే మ‌రో తుఫాన్ గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మ‌రో అల్ప‌పీడ‌న

By Medi Samrat  Published on  29 Nov 2020 5:03 AM GMT
పొంచిఉన్న మ‌రో తుఫాన్ గండం

నివ‌ర్‌ తుఫాన్ నుంచి ఇంకా కోలుకోక ముందే మ‌రో తుఫాన్ గండం పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మ‌రో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డింది. అది రేప‌టిక‌ల్లా వాయుగుండంగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంద‌ని వాతావరణ శాఖ పేర్కొంది. దీనికి 'బురేవి' అని పేరు పెట్టారు. డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తారు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. ఇవాళ, రేపు తెలంగాణలో పొడి వాతావారణం ఉంటుందని అంటున్నారు అధికారులు.

తాజాగా ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఇది వాయుగుండంగా, తుఫాన్ గా మారే అవకాశాలు అధికంగా ఉన్నాయని, ఆపై పశ్చిమ దిశగా ప్రయాణిస్తుందని ఐఎండీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది దక్షిణ తమిళనాడు వైపు వస్తుందా? లేదా మరో దిశగా సాగుతుందా?అన్న విషయం ఈ సాయంత్రానికి తెలుస్తుందని అధికారులు తెలిపారు.

రానున్న వారం రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని, చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

దీని ప్రభావంతో ఆదివారం నుంచే తీర ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం ఉందని అధికారులు తెలపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే జలాశయాలు పూర్తిగా నిండి, చెరువులు, కుంటలతో పాటు పంట పొలాల్లోకి సైతం నీరు చేరిపోవడంతో మరోసారి వర్షాలు పడితే తమ పరిస్థితి ఏమవుతోందన్న భయం రైతుల్లో నెలకొని వుంది.




Next Story