తెలంగాణ, ఏపీలకు బిగ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల..
By అంజి
తెలంగాణ, ఏపీలకు బిగ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని వలన మంగళవారం (సెప్టెంబర్ 02) నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. నేడు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
అటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశ ఉందని తెలిపింది. అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.