ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. బిగ్‌ అలర్ట్‌ ఇచ్చిన వాతావరణ కేంద్రం

బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం సుమారు నిన్న సాయంత్రం5 గంటల సమయంలో గోపాల్‌పూర్ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

By -  అంజి
Published on : 3 Oct 2025 6:55 AM IST

APSDMA, heavy rain, North Andhra, APnews, CM Chandrababu

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. బిగ్‌ అలర్ట్‌ ఇచ్చిన వాతావరణ కేంద్రం

బంగాళాఖాతంలోని తీవ్రవాయుగుండం సుమారు నిన్న సాయంత్రం5 గంటల సమయంలో గోపాల్‌పూర్ సమీపంలో ఒడిశా తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరాన్ని దాటడానికి ముందు తీవ్ర వాయుగుండం 17కి.మీ వేగంతో కదిలిందని చెప్పింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ ఉదయానికి క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఇవాళ ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది.

వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవిస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ఆదేశించారు.

అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలని నిర్దేశించారు. కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు సేవలు అందిస్తూ, అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనేందుకు బృందాలు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మంత్రులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పారు.

Next Story