తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఏపీలోని విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో, తెలంగాణలోని హైదరాబాద్, కేపీహెచ్‌బీ, జూబ్లీహిల్స్, కృష్ణానగర్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. అటు ఉప్పాడ సముద్ర తీరం అల్లకల్లోంగా మారింది. బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది.
కాగా కేరళలోకి ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఇవాళ ఏపీలోని రాయలసీమను తాకాయి. గత ఏడాది జూన్ 2న ఏపీని తాకగా ఈ సారి వారం ముందుగానే వచ్చాయని ఏపీఎస్‌డీఎంఏ పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను తాకినట్టు వాతావరణ నిపుణులు తెలిపారు. రేపు, ఎల్లుండి మరింత విస్తరిస్తాయని పేర్కొన్నారు.
ఈ నెల 29 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని.. నైరుతి విస్తరణకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని తెలిపింది. మంగళవారం పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది.