రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడే భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు చెట్ల కింద నిలబడ వద్దని సూచించారు.
నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అటు తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.