నైరుతి బంగాళాఖాతం వెంబడి ఉత్తర శ్రీలంక తీర ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నందున.. అమరావతి వాతావరణ శాఖ రాబోయే మూడు రోజుల వాతావరణ సూచనలను జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో పలుచోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
నేటి నుంచి బుధవారం వరకు దక్షిణ కోస్తాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమలో పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.