తూర్పుమధ్య బంగాళాఖాతంలో ‘దానా’ తుపాన్ రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం చెందనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో తుపాన్ కదులుతున్నట్లు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం ఉందని.. పూరీ-సాగర్ ద్వీపం మధ్య భితార్కానికా మరియు ధమ్రా (ఒడిశా) సమీపంలో తుపాన్ తీరం దాటనున్నట్లు వెల్లడించారు.
ప్రస్తుతానికి పారాదీప్ (ఒడిశా)కి 520 కిమీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 600 కిమీ మరియు ఖేపుపరా (బంగ్లాదేశ్)కి 610 కిమీ. దూరంలో దానా తుపాన్ కేంద్రీకృతమై ఉందని తెలిపారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి ఈరోజు మధ్యాహ్నం నుంచి గంటకు 80-100కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. రేపు రాత్రి నుంచి 100-110కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ మేరకు పలు సూచనలు చేశారు.
• భారీ వృక్షాలు, చెట్ల దగ్గర / కింద నిల్చోవడం, కూర్చొవడం చేయవద్దు.
• ఎండిపోయిన చెట్లు / విరిగిన కొమ్మలను తొలగించండి వాటి కింద ఉండకండి.
• వేలాడుతూ, ఊగుతూ ఉండే రేకు/మెటల్(ఇనుప) షీట్లతో నిర్మించిన షెడ్లకు దూరంగా ఉండండి. పాత భవనాలు, శిధిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకండి.
• కరెంట్/ టెలిఫోన్ స్థంబాలకు, లైన్లకు, హోర్డింగ్స్ కు దూరంగా ఉండండి.
• మీరు ప్రయాణంలో ఉంటే వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళండి.
అలాగే.. ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుందని.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.