రెయిన్ అలర్ట్..తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది.
By Knakam Karthik
రెయిన్ అలర్ట్..తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరో మూడ్రోజులు వానలు కురుస్తాయని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తూర్పు ఆగ్నేయ దిశలో కదిలి ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఏపీకి ఆనుకొని ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడి ఉంది. వీటికి సమాంతరంగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ వాతావరణ మార్పులు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు పడుతున్నాయి.
తెలంగాణలో 4 రోజులు వర్షాలు
తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఏపీలోనూ భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.