అమరావతి: నవంబర్ 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 21 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువగా ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం దీని ప్రభావంతో ఈనెల24-27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందంది.
అల్పపీడనంపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత రానున్నట్లు తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది. అటు తెలంగాణకు ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ శీతలగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.