ఏపీలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు: వాతావరణ శాఖ

Andhrapradesh likely to receive rains for next two days. ఏపీలో మరో రెండ్రోజులు పాటు వర్షాలు: వాతావరణ శాఖ

By అంజి  Published on  25 July 2022 7:22 AM GMT
ఏపీలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు: వాతావరణ శాఖ

ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. నాలుగైదు రోజులుగా ఉత్తరాదిన ఉన్న రుతుపవనాల ద్రోణి శనివారం దక్షిణం వైపు మళ్లింది. అలాగే ఒడిశా, ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా మారి కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో వర్షాలు కురుస్తున్నాయి.

అలాగే కోస్తా, రాయలసీమల్లో ఇవాళ, రేపు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 2, 3 రోజుల్లో వర్షాలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఏలూరు జిల్లా పోలవరంలో ఆదివారం సాయంత్రం గోదావరి నీటిమట్టం తగ్గింది. అప్పర్ కాఫర్ డ్యామ్ వద్ద 32.540 మీటర్లకు, లోయర్ కాఫర్ డ్యామ్ వద్ద 23.91 మీటర్లకు తగ్గింది. ఎగువ నుంచి దిగువకు వస్తున్న 6,71,982 క్యూసెక్కులను అధికారులు విడుదల చేశారు.

మరోవైపు శ్రీశైలం జలాశయానికి ఆదివారం వరద ప్రవాహం తగ్గింది. దీంతో డ్యామ్‌ ఒక్క గేటు ద్వారా నీటిని విడుదల చేయడంతోపాటు ఏపీ, తెలంగాణ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. డ్యామ్‌లోకి 76,294 క్యూసెక్కుల నీరు వస్తుండగా కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 31,567 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. స్పిల్‌ వే ద్వారా 26,560 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

అలాగే జురాల, సుంకేశుల నుంచి 24,968 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి ప్రవాహం తగ్గుతుండడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 11 అడుగుల వరకు నీటి మట్టం ఉంది. 5,200 క్యూసెక్కుల నీటిని పంట కాల్వలకు , 8.58 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువన కురి సిన వర్షాలకు జలాశయానికి 4,622 క్యూసెక్కుల వరద వస్తుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

Next Story