Andhra Pradesh : దంచికొడుతున్న ఎండలు.. కాకానిలో రికార్డ్ ఉష్ణోగ్రత నమోదు
రాష్ట్రంలో ఎండతీవ్రత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కోన్నారు.
By Medi Samrat
రాష్ట్రంలో ఎండతీవ్రత పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ పేర్కోన్నారు. సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో 43.7°C గరిష్ఠ ఉష్ణోగ్రత, 17 జిల్లాల్లో 41°Cకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వెల్లడించారు.
మంగళవారం (13-05-25) 42°C- 43.5°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం-4, విజయనగరం-2, పార్వతీపురంమన్యం-11, కాకినాడ -3, తూర్పుగోదావరి-1 మండలాల్లో తీవ్రవడగాలులు(21), మరో 32 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు. బుధవారం 22 మండలాల్లో తీవ్ర, 36 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. గురువారం రాష్ట్రంలో మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు.
రేపు శ్రీకాకుళం-2, విజయనగరం-14, పార్వతీపురంమన్యం-2, అల్లూరి సీతారామరాజు-3, కాకినాడ-4, తూర్పుగోదావరి-7 మండలాల్లో వడగాలులు(32) వీచే అవకాశం ఉందన్నారు.
వడగాలులు వీచే మండలాల వివరాలు లింకు : https://apsdma.ap.gov.in/files/651628d4a8349bb87189eb08d7f00c4b.pdf
సోమవారం పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కాకానిలో 43.7°C, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 43.5°C, ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 43.3°C, ఎన్టీఆర్ జిల్లా మొగులూరులో 43.1°C, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల 42.8°C, ఏలూరులో 42.6°C, విజయనగరం జిల్లా ధర్మవరంలో 42.5°C, తిరుపతి జిల్లా గూడూరు 42.3°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. పల్నాడు 21 ప్రాంతాల్లో, ఎన్టీఆర్ 15, ప్రకాశం 12, బాపట్ల 9, గుంటూరు 8 సహా ఇతర చోట్ల కలిపి 116 ప్రాంతాల్లో 41°C కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డైనట్లు వివరించారు.
ఎండలో బయటకు వెళ్లేప్పుడు నెత్తికి టోపి పెట్టుకోండి లేదా రూమాలు కట్టుకోండి, తెలుపురంగు గల కాటన్ వస్త్రాలను ధరించండి. అదేవిధంగా మీ కళ్ళ రక్షణ కోసం సన్ గ్లాసెస్ ఉపయోగించండి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.
మరోవైపు రేపు రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పిడుగులు, ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదన్నారు.