ఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
By Srikanth Gundamalla Published on 7 Dec 2023 2:31 AM GMTఏపీ, తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు
బాపట్ల దగ్గర తీరం దాటిన మిచౌంగ్ తుపాను ఉత్తరంగా పయనించే క్రమంలో బలహీనపడింది. అల్పపీడనంగా మారి కోస్తా, దక్షిణ ఒడిశా, దక్షిణ చత్తీస్‌గఢ్‌కు ఆనుకుని తెలంగాణ ఈశాన్య ప్రాంతంలో కొనసాగింది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్నాయి. వాటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలోని పలు చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాలో వర్షాలు పడుతాయని చెబుతోంది.
ఏపీలో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా దార్లపల్లిలో 29.5 సెం.మీ, ఏలూరు జిల్లా రేచర్లలో 26 సెంమ.ఈ, తూర్పగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 25 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యింది. అయితే.. బుధవారం మధ్యాహ్నం నుంచి అయితే వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురవడంతో ఏపీలో ఆయా ప్రాంతాలు జలమయం అయ్యాయి. బాపట్ల జిల్లాలోని పర్చూరు, కారంచేడు ప్రాంతాల్లో వాగలు పొంగి ప్రవహించాయి. ఉత్తరాంధ్రలో వరద ధాటికి చాలాచోట్ల ఇళ్లలోకి నీరు చేరింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో కాలనీల్లోకి నీరు చేరింది. అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో గోస్తనీ నది ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి. తుపాను ప్రభావంతో రైతులు నష్టపోయారు. అయితే.. రైతులు అధైర్య పడొద్దని.. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. తుపాను బాధితులకు పరిహారం అందించడంపై సానుభూతితో ఉండాలని కలెక్టర్లు, అధికార యంత్రాంగాన్ని జగన్ ఆదేశించారు.
మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులుతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. బుధవారం కుమ్రంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. తెలంగాణ వ్యాప్తంగా 22.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, మద్దుకూరులో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది.
తెలంగాణలోని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. తుపాను ప్రాభవంతో మూడ్రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సాధారణ కంటే నగరంలో 6-7 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. చలితీవ్రత ఒక్కసారిగా పెరిగింది. తెల్లవారు జామున ఉదయం మంచు కప్పేయడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.