తెలంగాణకు రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు
Alert Heavy Rains In Telangana Today and Tomorrow.తెలంగాణ రాష్ట్రానికి మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని
By తోట వంశీ కుమార్ Published on 5 Aug 2022 2:19 AM GMT
తెలంగాణ రాష్ట్రానికి మరోసారి భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రుతుపవనాల ప్రభావానికి తోడు ఉపరితల ద్రోణి రాష్ట్రంపై కొనసాగుతుండడంతో ఈ నెల 9వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న మాట్లాడుతూ.. 7న 12 సెం.మీ నుంచి 20 సెం.మీ, 8, 9వ తేదీల్లో 20 సెం.మీపైన వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని వివరించారు. ఇప్పటికే ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలకు అందజేసినట్లు తెలిపారు.
నేడు 14 జిల్లాల్లో..
రాష్ట్రంలోని 14 జిల్లాల్లో శుక్రవారం ఉరుములతో కూడిన వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
గురువారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. కరీంనగర్ జిల్లా గంగాధరలో అత్యధికంగా 15.5 సెం.మీ వర్షం కురిసింది.