Fact Check : ఫేస్ మాస్క్ వాడితే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ కలుగుతుందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 20 Aug 2020 4:23 PM IST![Fact Check : ఫేస్ మాస్క్ వాడితే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ కలుగుతుందా..? Fact Check : ఫేస్ మాస్క్ వాడితే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ కలుగుతుందా..?](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/08/wearing-face-mask-leads-to-lung-infections.jpg)
ఫేస్ మాస్కులను వాడడం ద్వారా ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వస్తుందని చెబుతూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. చర్మానికి ఎన్నో ఇబ్బందులని దురద, దద్దుర్లు, మొటిమలతో పాటూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రావడమే కాకుండా స్పృహలో లేకుండా పోయే అవకాశం ఉందని కొందరు పోస్టులు పెట్టారు.
దద్దుర్లు, మొటిమలు ఉన్నటువంటి ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ ఉన్నారు.
ఈ స్కిన్ రియాక్షన్లను చూడండి.. తాను ఎక్కడికి వెళ్లినా మాస్కుల వలన ఇబ్బంది కలుగుతోందని చెబుతున్నారని.. ఇప్పుడేమి చేయాలో తెలియడం లేదంటూ ఆ పోస్టులో చెప్పుకొచ్చారు.
నిజ నిర్ధారణ:
ఈ వైరల్ పోస్టులో ఎటువంటి నిజం లేదు. మాస్కులను వాడడం ద్వారా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చి.. స్పృహ తప్పి పడిపోవడం అన్నది జరగదు.
Johns Hopkins గైడ్ ప్రకారం కొన్ని కమర్షియల్ మాస్కులను శుభ్రపరచడానికి ఫార్మల్ డిహైడ్ ను వాడుతారు. ఆ కెమికల్ కొందరికి అలర్జీగా మారుతుంది. సింథటిక్ ఫ్యాబ్రిక్ కూడా కొందరికి నప్పకపోవడం వలన చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. మాస్కులను ఉతికేటప్పుడు ఉపయోగించే డిటర్జెంట్స్, సాఫ్ట్నర్స్ ల వలన కూడా కొందరికి దురద, దద్దుర్లు, చర్మం ఎరుపెక్కడం వంటివి జరుగుతూ ఉంటుంది. అందువలనే మాస్కుకు ఉపయోగించే వస్త్రం విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఉతికే సమయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతూ ఉన్నారు.
అమెరికన్ అకాడెమీ ఆఫ్ డెర్మటాలజీ కూడా మాస్కుల నుండి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వెల్లడించింది. నాలుగు గంటలు అంతకు మించి ఎక్కువసేపు కూడా మాస్క్ వేసుకోవద్దని సూచించింది. మాస్కులను ఉతక్కుండా అలాగే వేసుకుంటూ ఉండడం కూడా మంచిది కాదని తెలిపింది. మాస్క్ వేసుకునే సమయంలో మేకప్ కు దూరంగా ఉండాలి అన్న సూచనలను కూడా ఇవ్వడం జరిగింది.
సామాజిక దూరం పాటించని చోట మాస్కులను వేసుకోవాల్సిందేనని.. ఇల్లు, లాంటి ప్రాంతాల్లో అవసరం లేదని పలువురు నిపుణులు చెప్పారు. కరోనాను కట్టడి చేయడంలో మాస్కులు పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయని చెబుతున్నారు. అంతేకానీ మాస్కుల కారణంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అవుతుందని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు.
గతంలో కూడా ఫేస్ మాస్కుల విషయంలో ఎన్నో రూమర్లు వచ్చాయి. మాస్కులు ఎక్కువగా వాడడం వలన శరీరంలోకి ఆక్సిజన్ వెళ్లడం కష్టమవుతుందని.. అలా ఆక్సిజన్ వెళ్ళకపోవడం వలన చనిపోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వదంతులు వ్యాపించాయి. ఇవన్నీ అబద్ధాలే అని వైద్యులు, నిపుణులు కొట్టివేశారు. ప్రజలు వీటిని పట్టించుకోకండి అంటూ సూచించారు.
ఫేస్ మాస్కులను వాడడం ద్వారా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అవుతుందన్న పోస్టులో కూడా 'ఎటువంటి నిజం లేదు'.