సర్జికల్ స్ట్రైక్స్ 3-పాక్‌కు దడ పుట్టించిన ఆ ఆయుధం ఏంటీ?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 5:52 PM GMT
సర్జికల్ స్ట్రైక్స్ 3-పాక్‌కు దడ పుట్టించిన ఆ ఆయుధం ఏంటీ?

రాఫైల్ ఫైటర్లను వాడలేదు.. మిస్సైళ్లను ప్రయోగించలేదు.. అస్సలు సరిహద్దులే దాటలేదు. బోర్డర్‌ లోపలే ఉండి ప్రత్యర్థి తాట తీసింది. శాటిలైట్ల సాయంతో ఉగ్ర వాదుల లాంచింగ్ ప్యాడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టి పేల్చి పారేసింది. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే శత్రువు గుండెలు ధఢేల్మని పేలిపోయాయి.

ఇంటి ముందు కొడతా.. ఇంటి లోపల కొడతా.. ఇంటి బయట కొడతా.. ఎక్కడైనా... ఎప్పుడైనా... కొట్టడం మాత్రం గ్యారంటీ... హద్దుల్లో ఉంటే బతికిపోతారు... లేకపోతే చచ్చిపోతారు.. పాకిస్థాన్ విషయంలో మనదేశం తీరు ఇదే. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పాక్ విషయంలో ప్రభుత్వ వైఖరి పూర్తి గా మారిపోయింది. తూటాకు తూటాతోనే సరిపెట్టడం లేదు. ఒక్క తూటాకు వంద తూటాలకు సమాధానమిస్తోంది. ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో అటు భారత ప్రభుత్వం, ఇటు భారత సైన్యం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడే ఉగ్రవాదులను ఎప్పటికప్పుడు మట్టుబెడుతున్నారు. అవసరమైతే సరిహద్దులు దాటి మరీ ఉగ్రవాద శిబిరాలను పేల్చివేస్తున్నారు. వరుస దాడులతో పాకిస్థాన్ నీరుగారిపోతోంది.

భారత్ ఎదురు దాడి

పాకిస్థాన్ భారత సైన్యం మరోసారి షాకిచ్చింది. మొదట పదాతి దళం, రెండోసారి వాయుదళంతో దెబ్బ కొట్టిన ఇండియన్ ఆర్మీ ముచ్చటగా మూడోసారి శత ఘ్నులతో దెబ్బ తీసింది. కశ్మీర్ విషయంలో రగిలిపోతున్న పాక్, వందలమంది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చింది. వారిని మనదేశంలోకి పంపి విధ్వంసం సృష్టిం చాలని ప్లాన్ వేసింది. టెర్రరిస్టులను దేశంలోకి పంపడానికి ఎప్పుడూ ఉపయోగించే టెక్నిక్‌నే ఉపయోగించింది. కీలక సెక్టార్ల వెంబడి పాక్ సైన్యం కాల్పులు మొద లు పెట్టింది. ఈ కాల్పులతో భారత సైన్యం దృష్టి మరల్చి, వేరే ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను దేశంలోకి పంపించాలన్నది పాకిస్థాన్ కుట్ర. కానీ, ఈ ప్లాన్‌ను పసిగట్టిన భారత సైన్యం ఫుల్ ప్రిపేర్డ్‌గా ఉంది. పాక్ కాల్పులు మొదలుకావడంతోనే అనూహ్య స్థాయిలో ఎదురుదాడి చేసింది. ఏకకాలంలో పాక్ సైనికులు, ఉగ్ర వాదులను మట్టుబెట్టింది.

గురి చూసి ఎలా కొట్టగలిగారు..?

భారత సైన్యం దెబ్బకు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల క్యాంపులు పేలిపోయాయి. నీలం లోయ వెంబడి జురా, అథ్, ముకమ్, కుందల్ షాహిల్లో టెర్రరిస్టుల స్థావరాలు ఛిన్నాభిన్నమయ్యాయి. దాదాపు 10 మంది పాక్ సైనికులు, 30 మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. ఐతే, శతఘ్నులతోనే భారత సైన్యం ఈ పని ఎలా పూర్తి చేయగలిగింది..? కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రక్యాంపులను పర్‌ఫెక్ట్‌గా ఎలా పేల్చేయగలిగారు..? ఈ ప్రశ్నలపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. భారత ప్రభుత్వం ఇటీవల అమెరికా నుంచి జీపీఎస్ గైడెడ్ షెల్స్‌ను కొనుగోలు చేసింది. ఇవి 155MM ఆర్టిలరీ అమ్యూనిషన్. అలాగే అమె రికాలోని రేథియాన్-ఎంఎన్సీబీఏఈ సంస్థలు M-982 పేరుతో శతఘ్ని గుండ్లను అభివృద్ధి చేశాయి. ఇవి జీపీఎస్‌ వ్యవస్థ ఆధారంగా పని చేస్తాయి. వీటితో దూర ప్రాంతాల్లోని లక్ష్యాలను కూడా గురి తప్పకుండా కొట్టవచ్చు. ఇవి ఒకసారి ప్రయోగిస్తే 50 కిలోమీటర్లు ప్రయాణించి టార్గెట్‌ను ఛేదిస్తాయి. ఒకవేళ గురి తప్పినా నిర్దేశిత ప్రాంతానికి 2 మీటర్ల లోపే పడతాయి. వీటిని K9 హొవిట్జర్ శతఘ్నుల్లో ఉపయోగించవచ్చు. వీటిని కూడా భారత ప్రభుత్వం గతంలోనే కొనుగోలు చేసిం ది. సరంజామా అంతా సిద్ధంగా ఉండడంతో సరిహద్దుల్లోనే ఉండి దాయాదిని దెబ్బ తీయడానికి వీలు ఏర్పడింది.

దాయాదికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందా?

సాధారణంగా శతఘ్నులతో దాడి చేసినప్పుడు లక్ష్యాలు గురితప్పితే చుట్టుపక్కల భారీగా నష్టం వాటిల్లుతుంది. పాక్ సైన్యం కూడా జనావాసాల మధ్యలో నక్కి భారత సైన్యంపై దాడులు చేస్తూ ఉంటుంది. సాధారణ పౌరులు మరణిస్తే అందుకే భారతే కారణమని ప్రచారం చేస్తుంది. పీఓకే వెంబడి ఉన్న ఉగ్రస్థావరాల చుట్టు పక్కల కూడా సాధారణ ప్రజలు ఉండే అవకాశం ఉండటంతో భారతసైన్యం అప్రమత్తమైంది. ప్రజలకు ఏమాత్రం నష్టం వాటిల్లకుండా, ఉగ్రవాదులు, వారికి అం డగా నిలిచే సైనికులను మాత్రమే దెబ్బ తీసేలా శాటిలైట్ గైడెడ్ షెల్స్‌ను ప్రయోగించింది. దాంతో దాయాది దేశానికి దిమ్మ తిరిగిపోయింది.

లేజర్ గైడెడ్ బాంబ్ లు

ఫిబ్రవరిలో పాక్‌తో ఉద్రిక్తత పెరగడంతో అత్యవసర కొనుగోళ్లలో భాగంగా మోదీ సర్కారు శాటిలైట్ గైడెడ్ షెల్స్‌ను తెప్పించింది. వాస్తవానికి ఇలాంటి షెల్స్ మన దేశానికి కొత్తేమీ కాదు. 1999 నుంచి 2002 వరకు రష్యా నుంచి క్రాస్నోపోల్ రకానికి చెందిన 3 వేల లేజర్ గైడెడ్ షెల్స్ కొనుగోలు చేశాం. వాటికి 11 కోట్ల డాలర్ల మేర ఖర్చైంది. అవి మన బోఫోర్స్ గన్స్‌కు ఉపయోగపడతాయని భావించారు. ఐతే, అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో ఇజ్రాయెల్ నుంచి సరికొత్త లేజర్ గైడెడ్ బాంబులను కొనుగోలు చేసింది. ఇటీవల అమెరికా నుంచి M-982 పేరుతో శతఘ్ని గుండ్లను కూడా కొనుగోలు చేసి సైన్యానికి అప్పగించింది. దాంతో భారత సైన్యం సరిహద్దుల నుంచి ప్రత్యర్థులను దడదడలాడిస్తోంది.

Next Story