రామ్ మాస్ట‌ర్ ప్లాన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Aug 2020 9:17 AM GMT
రామ్ మాస్ట‌ర్ ప్లాన్

టాలీవుడ్‌లో ఆరు నెలల కిందటే ఫస్ట్ కాపీతో సిద్ధమై థియేటర్లు మూత పడటంతో విడుదలకు నోచుకోకుండా ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఈ ఆరు నెలల ఎదురు చూపుల తర్వాత కూడా థియేటర్లు తెరుచుకోకపోవడంతో నాని నటించిన ‘వి’ లాంటి క్రేజీ మూవీని నిర్మాత దిల్ రాజు నేరుగా అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడు. ఇదే బాటలో సోలో బ్రతుకే సో బెటర్, నిశ్శబ్దం, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి లాంటి చిత్రాలు ఓటీటీల్లో విడుదలకు ఓకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.

అయితే రవితేజ ‘క్రాక్’ సినిమా మేకర్స్ మాత్రం తమ చిత్రం థియేటర్లలోనే రిలీజవుతుందని స్పష్టం చేశారు. రవితేజ సినిమా అంటే థియేటర్లలో ఎంజాయ్ చేసేవాళ్లే మాస్ ఫ్యాన్సే ఎక్కువ ఉంటారన్నది వారి నమ్మకం. ఇక మెగాస్టార్ చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ అరంగేట్రం ఓటీటీల్లో జరిగితే బాగుండదని ‘ఉప్పెన’ను ఆపుతున్నారు.

ఇవి కాకుండా ఓటీటీ ఆఫర్లకు నో చెబుతున్న సినిమా ‘రెడ్’. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ నటించిన ఈ చిత్రం తమిళ హిట్ ‘తడమ్’కు రీమేక్. ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి ఓటీటీల నుంచి మంచి ఆఫర్లే వచ్చినా సరే.. అలా రిలీజ్ చేయడానికి రామ్ నో అంటున్నట్లు తెలుస్తోంది.

ఇందుక్కారణం ఏంటని ఆరా తీస్తే.. సినిమా మీద పెట్టిన పెట్టుబడి అంతా ఇప్పటికే నిర్మాత చేతికి వచ్చేసిందట. హిందీ డబ్బింగ్, శాటిలైట్‌ హక్కులతోనే ఆ మొత్తం వర్కవుట్ అయిపోయిందట. దీంతో ఫైనాన్స్ మొత్తం క్లియరైపోయింది. వడ్డీల భారం లేదు. అలాంటపుడు ఓటీటీలకు వెళ్లాల్సిన అవసరం కనిపించలేదు.

దీనికి తోడు వచ్చే సంక్రాంతికి పెద్ద సినిమాలు రేసులో నిలిచే అవకాశాలు తక్కువగా ఉండటంతో రాబోయే కొన్ని నెలల్లో థియేటర్లు తెరుచుకుని సంక్రాంతి సమయానికి మామూలుగా షోలు నడిచే అవకాశం ఉంటే తమ సినిమాను రిలీజ్ చేసి మంచి ప్రయోజనం పొందవచ్చని రామ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్‌తోనే ఓటీటీ రిలీజ్‌కు ససేమిరా అంటున్నట్లు సమాచారం.

Next Story