నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా : సీఎం

By Medi Samrat  Published on  28 July 2020 11:28 AM GMT
నా బట్టలు నేనే ఉతుక్కుంటున్నా : సీఎం

కరోనా పాజిటివ్‌ కారణంగా చికిత్స‌ పొందుతున్న మధ్య ప్రదేశ్ ముఖ్య‌మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్‌మీడియాలో వైరల్ అవుతోంది. మ‌హ‌మ్మారి కరోనాతో తాను ఎలా పోరాడుతున్నారో ఆయ‌న ఆ వీడియోలో వివరించారు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

రాష్ట్రంలో కొవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు సమావేశం నిర్వహించిన‌ 61 ఏళ్ల చౌహాన్.. తనకు కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని శనివారం ప్రకటించారు. అదేరోజు భోపాల్‌లోని చిరాయు ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ నిన్న విడుదల చేసిన మరో వీడియోలో.. తాను బాగానే ఉన్నాననీ, కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లెవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్న సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఈ రోజు ఉద‌యం.. ఆస్పత్రి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. పలువురు మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా.. ఆస్పత్రిలో నా చాయ్ నేనే తయారుచేసుకుంటున్నా. కొవిడ్ పేషెంట్లు తమ దుస్తులు వేరే వాళ్లతో ఉతికించకూడదు కాబట్టి, నా బట్టలు కూడా నేనే ఉతుక్కుంటున్నా. బట్టలు ఉతుక్కోవడం వల్ల నాకు ఓ ప్రయోజనం దక్కింది. గతంలో నా చేతికి సర్జరీ జరిగింది. అనేకమార్లు ఫిజియోథెరపీ చేసినా నా చేత్తో దేన్నీ గట్టిగా పట్టుకోలేకపోయాను. కానీ ఇప్పుడు బట్టలు ఉతకడం వల్ల నా చెయ్యి బాగుపడింది. కాబట్టి కొన్ని పనులు స్వయంగా మన చేతులతోనే చేసుకోవడం మంచిదనిపించిందని సీఎం చౌహాన్ పేర్కొన్నారు.

Next Story