తెలంగాణ రాష్ట్ర రెండో రాజధాని వరంగల్ మహా నగరంలో మరో టెక్ సెంటర్ రాబోతోంది. నగరంలో టెక్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అమెరికా దిగ్గజ ఐటీ కంపెనీ జెన్ ప్యాక్ట్ ముందుకు వచ్చింది. ఈ మేరకు కంపెనీ సీఈవో త్యాగరాజన్.. మంత్రి కేటీఆర్‌తో జరిగిన వర్చువల్ సమావేశంలో వెల్లడించారు. కాగా టెక్ సెంటర్ ఏర్పాటుపై జెన్ ప్యాక్ట్ ప్రకటన చేయడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వరంగల్ నగరం ఐటీ హబ్‌గా జెన్ ప్యాక్ట్ రాకతో మంరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా టైర్ 2 పట్టణాల్లో ఐటీ అభివృద్ధికి సహకరిస్తున్న సంస్థలకు తమ మద్దతు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. జెన్‌ప్యాక్ట్ సీఈవో త్యాగరాజన్, వారి బృందానికి కేటీఆర్ అభినందలు తెలిపారు. జెన్‌ప్యాక్ట్ టెక్ సెంటర్‌తో వరంగల్ నగరం అత్యున్నత స్థాయికి ఎదగనుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాగా ఇప్పటికే సైయంట్, టెక్ మహీంద్రా కంపెనీలు వరంగల్ నుండి పని చేస్తున్నాయి. తాజాగా వీటి సరసన జెన్ ప్యాక్ట్ చేరనుంది. మొత్తంగా వచ్చే ఆరు నెలల లోపు ఈ టెక్ సంస్థ సేవలను ప్రారంభించనుందని తెలుస్తోంది. వరంగల్ నగరంలో ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్‌తో జరిగిన సమావేశం కంపెనీ సీఈవో త్యాగరాజన్ చెప్పారు.