లండన్‌లో గుండెపోటుతో వరంగల్‌ జిల్లా వాసి మృతి

By సుభాష్  Published on  14 April 2020 3:37 AM GMT
లండన్‌లో గుండెపోటుతో వరంగల్‌ జిల్లా వాసి మృతి

తెలంగాణలోని వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి లండన్‌లో గుండెపోటుతో మృతి చెందాడు. జిల్లాలోని ఐనవోలు మండలం రాంనగర్‌ గ్రామానికి చెందిన కైత సతీష్‌ (26) అనే వ్యక్తి ఉన్నత చదువుల నిమిత్తం గత ఏడాది లండన్‌కు వెళ్లాడు. రూమ్‌లో నిద్రిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. ఈ విషయాన్ని అతని స్నేహితులు పోలీసులకు సమాచారం అందించగా, వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే సతీష్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఈ విషయం ఆయన స్నేహితులు సతీస్‌ తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా తెలియజేశారు. కొడుకు మరణ వార్త వినగానే తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గత మూడు రోజుల కిందటనే ఫోన్‌లో మాట్లాడామని, అక్కడ కరోనా అధికంగా ఉన్న కారణంగా జాగ్రత్తగా ఉండాలని సూచించామని, అంతలోనే మరణవార్త వినాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు.

కాగా, సతీష్‌కు ఇద్దరు సోదరులు కూడా విదేశాల్లోనే ఉంటున్నారు. అన్న రంజిత్‌ అమెరికాలో ఉండగా, తమ్ముడు దేవేందర్‌ యూకేలోనే ఎంఎస్‌ విద్యనభ్యసిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఎలాగైన తమ కుమారున్ని స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story
Share it