మామిడి తోటలో వాలంటీర్లు.. ఏం చేశారంటే..?
By తోట వంశీ కుమార్ Published on 23 April 2020 2:03 PM ISTకరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించాలంటే.. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే చెబుతన్నాయి. అయినప్పటికి కొందరు మాత్రం వీటిని పెడచెవిన పెడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా విజృంభిస్తోంది. నిత్యావసరాల కోసం ప్రజలు బయటికి రాకుండా గ్రామ వాలంటీర్ల సాయంతో వాటిని ప్రజలకు అందిస్తోంది ప్రభుత్వం. ప్రజలందరికి ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యత వాలంటీర్లపై ఉంది. అయితే.. విశాఖ జిల్లా యలమంచిలి ఏటికొప్పాకలోని గ్రామ వాలంటీర్లు నిబంధనలు ప్రజలకే తమకు పట్టవన్నట్లు వ్యవహరించారు.
విశాఖలోని ఏటికొప్పాకకు చెందిన ఓ గ్రామ వాలంటీర్ పుట్టినరోజు కావడంతో మామిడి తోటలో పార్టీ ఇచ్చాడు. తనతో పాటుగా పనిచేస్తున్న 11 మంది గ్రామ వాలంటీర్లు ఈ పార్టీకి హాజరయ్యారు. సామాజిక దూరం పాటించకుండా.. మామిడి తోటలో ఏర్పాటు చేసిన విందులో వీళ్ళు పాల్గొన్నారు. ఫోటోలు దిగారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ 11 మంది గ్రామ వాలంటీర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామస్తులు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇలాంటి పనులను వాలంటీర్లే చేస్తే.. తరువాత జరిగే.. పరిణాలను ఊహించలేమని గ్రామస్తులు వాపోతున్నారు.