'కంగ‌నా'ను.. పేరు చెబితేనే రక్తం ఉడుకెత్తిపోయే స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడితో పోల్చిన విశాల్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Sept 2020 6:07 PM IST
కంగ‌నాను.. పేరు చెబితేనే రక్తం ఉడుకెత్తిపోయే స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడితో పోల్చిన విశాల్‌

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత నుండి‌ సోషల్‌ మీడియా వేధిక‌గా‌ నటి కంగనా రనౌత్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. బాలీవుడ్ నెల‌కొన్న ప‌రిస్థితుల‌పై గ‌ళ‌మెత్తుతూనే ఉన్నారు. అయితే.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు చివరికి రాజకీయ రంగు పులుముకుంది. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంపై కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తోంది.

‘శివసేన వర్సెస్ కంగనా’ అంటూ హైడ్రామా నెలకొంది. శివసేన, కంగనాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్న తరుణంలో బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) బుధ‌వారం కంగనా కార్యాలయాన్ని కూల్చివేసింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణంగా బీఎంసీ అధికారులు చెప్పారు.

ఈ నేఫ‌‌థ్యంలోనే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ స‌ర్కార్‌పై ఆమె వీరోచిత పోరాటానికి సిద్ధమైంది. ఈ పోరాటానికి కంగనాకు పలువురి నుంచి మ‌ద్ద‌తు లభిస్తుంది. తాజాగా త‌మిళ‌‌ హీరో విశాల్‌.. కంగనా ర‌నౌత్‌కు మద్దతు తెలుపుతూ.. ట్విట‌ర్‌లో ఓ లెట‌ర్‌ను విడుదల చేశారు. ఈ లెట‌ర్‌లో విశాల్‌.. కంగనాను భగత్‌సింగ్‌తో పోల్చారు.

విశాల్ లెట‌ర్ ప్ర‌కారం.. డియర్‌ కంగనా.. నీ ధైర్యానికి హ్యాట్సాఫ్. ఏది స‌రైన‌ది, ఏది త‌ప్పు అని మీరు రెండుసార్లు ఆలోచించలేదు. మీ వ్యక్తిగత సమస్య కానప్పటికీ ఒక ప్రభుత్వంతో పోరాడుతున్నారు. 1920లో భగత్‌ సింగ్‌ ఎలా అయితే నిలబడ్డాడో అలా ధైర్యంగా మీరు నిలబడ్డారు. ప్రభుత్వాలు తప్పు చేస్తే.. ప్రజలు ఎలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడవచ్చో చూపించారు. సెలబ్రిటీలే కాదు సామాన్యుడు కూడా ప్రభుత్వాన్ని నిలదీయవచ్చనే సందేశాన్ని సమాజానికి ఇచ్చారు. వాక్‌ స్వాతంత్రపు హక్కు (ఆర్టికల్‌ 19) గుర్తు చేశారు. మీకు నేను న‌మ‌స్క‌రిస్తున్నాన‌ని పేర్కొన్నారు.

Next Story