విశాఖలో కిడ్నాప్‌ కలకలం.. ఎంపీ సత్యనారాయణ కుమారుడు, భార్య, ఆడిటర్ కిడ్నాప్

విశాఖలో ఎంపీ ఏంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ ఘటన కలకలం రేపుతోంది. ఏకంగా రుషికొండలోని ఎంపీ నివాసంలోకి

By అంజి  Published on  15 Jun 2023 1:32 PM IST
YCP MP Satyanarayana, kidnap, Crime news, Vizag, APnews

విశాఖలో కిడ్నాప్‌ కలకలం.. ఎంపీ సత్యనారాయణ కుమారుడు, భార్య, ఆడిటర్ కిడ్నాప్

విశాఖలో ఎంపీ ఏంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ ఘటన కలకలం రేపుతోంది. ఏకంగా రుషికొండలోని ఎంపీ నివాసంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఎంపీ భార్య, కొడుకుని కిడ్నాప్‌ చేయడం సంచలనం సృష్టిస్తోంది. మొదట ఎంపీ భార్య, కుమారుడిని బంధించి.. ఆ తర్వాత వారితో ఆడిటర్‌ జీవీని ఇంటికి పిలిపించినట్లు తెలుస్తోంది. సీతమ్మధార నుంచి రుషికొండకు ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు రాగానే.. ముగ్గురినీ కిడ్నాప్‌ చేశారని తెలుస్తోంది. ముగ్గురిని వాహనంలో తమతో తీసుకెళ్లారు. ఘటన జరిగినప్పుడు ఎంపీ ఇంటి వద్ద సెక్యూరిటీ పెద్దగా లేనట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించడానికి నిరాకరిస్తున్నారు. విశాఖలో ఎంపీ సత్యనారాయణ ప్రముఖ బిల్డర్‌గా ఉన్నారు. ఇవాళ ఉదయం ఆరున్నర, ఏడు గంటల మధ్య ఎంపీ ఇంట్లోకి ప్రవేశించి భార్య జ్యోతితో పాటు కుమారుడు శరత్‌ను కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది.

సిట్టింగ్ ఎంపీ భార్య, కుమారుడితో పాటు ఆడిటర్‌ను కిడ్నాప్‌ చేయడంతో కలకలం రేగింది. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు స్పందించారు. కిడ్నాపర్ల ఆచూకీ కనిపెట్టి, బందీలను విడిపించారు. కిడ్నాపర్లను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. తన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా ఈ కిడ్నాప్‌ వ్యవహారంపై రౌడీషీటర్‌ హేమంత్‌ అనే వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే కిడ్నాప్‌ జరిగినట్లు సమాచారం. కిడ్నాప్ తర్వాత నిందితులు రూ.50కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఎంవీవీ విషయం తెలియగానే హుటాహుటిన వైజాగ్‌కు బయలుదేరారు.

Next Story